తెలుగు వీర లేవరా..శ్రీశ్రీ వేలు పట్టుకుని సాగరా

సాహిత్యం అంటే అక్షరాలో, ఉపమానాలో కాదు. ఆయా కాలాలలో నినదించిన,ధాకలుచేసిన సత్యాలు. నిన్నటి గురించి తెలియకపోతే ఈరోజు ఎలా అర్థం అవుతుంది? ఈరోజు అర్థం కాకపోతే, రేపటి భవిష్యత్తు ఏం కనిపిస్తోంది. అలా కాలం అనే కత్తుల వంతెనపై ప్రయాణం చేయాలంటే శ్రీశ్రీలాంటి వారి సాహిత్యమే.. తరతరాల వంతెన గా నిలబడుతుందనటంలో అర్ద అక్షరం కూడా అసత్యం లేదు. అవును తెలుగు సాహిత్యంలో మహాకవి శ్రీశ్రీ ప్రభంజనం గురించి చాలా చర్చ జరిగింది..ఇంకా జరుగుతుంది. మహాప్రస్థానం ఇత్యాదిగా అన్ని రచనలపై ఇతోధికంగా ఇప్పటికే అనేక విశ్లేషణలు వచ్చాయి. ఇటు అభిమానులే కాక అటు ఆయనంటే గిట్టని ఛాందసులు కూడా శ్రీశ్రీని ప్రస్తావించకుండా ఆధునిక తెలుగు సాహిత్య చర్చను చేయలేరు..అసలు పరిచయమే చేయలేరు. ఇదంతా శ్రీశ్రీ సృజన సాధించిన ఘనత. ఆయన సృష్టించిన సాహిత్యం సాధించిన ఘన విజయం. ఒక్క సాహిత్యంపై మాత్రమే కాక సైన్సు, ఫిలాసఫీ, రాజకీయాలు, చరిత్ర, ఎకానమీ, సినిమా… ఇలా అనేక అంశాలపై శ్రీశ్రీ అభిప్రాయాలు ఇప్పటికే ఎక్కడో చోట కోట్ చేయకుండా ఉండలేం. అవి అంతలా ఈ తరాన్ని కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. ఆయన ఓ చోట ఇలా అంటారు.. ‘సాహిత్యమనేది ప్రజలకు ఉయోగకరమైనప్పుడే సార్థకమౌతుంది. కళ కోసం కళ అనే వాదానికి నేను బద్ధ విరోధిని. ప్రగతి శక్తులను ఎగసన దోసేది అయిన రచన నిజమైన సాహిత్యమని నేననుకుంటాను. కవిత్వంలో గానీ, నవలలో గానీ, ఏకాంక నాటికల్లో గానీ అన్ని సాహిత్య రూపాల్లోనూ ప్రగతికి దోహదకంరగా వుండేది, ప్రతీప శక్తులను వ్యతిరేకిస్తూ వాటి మీద పోరాటం జరిపించేటి ఏ సాహిత్యమైతే వుంటుందో అటువంటిది నాకు సమాదరణీయమని అనిపిస్తుంది’.