తెలుగు వీర లేవరా..శ్రీశ్రీ వేలు పట్టుకుని సాగరా

శ్రీశ్రీ కలం చాలా వాడిగా సమాజంలోని మూఢవిశ్వాసాలను చీల్చి చెండాడింది. సాహిత్యం ద్వారా సమాజప్రగతికి దోహదం చేయాలని విశ్వసించిన శ్రీశ్రీ సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను తూర్పారబట్టారు. ఇరవైయ్యో శతాబ్ధపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన ఈ మహాకవి తెలుగునాట అభ్యుదయ కవిత్వానికి ఊపిరిలుదారు. సామాన్యులకి అర్థమయ్యే రీతిన తెలుగు సాహిత్యాన్ని సరిళించి ఎన్నో కవితా సంపుటులు, పుస్తకాలు రాశారు. వాటిలో ప్రముఖంగా చెప్పుకునేది శ్రీశ్రీ మహా ప్రస్థానం. అలానే తెలుగు చిత్రసీమకు రచయితగా ఎనలేని సేవలందించారు శ్రీశ్రీ. తెలుగు తొలి డబ్బింగ్ సినిమా 1950లో విడుదలైన ‘ఆహుతి’కి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీనే . ఇక సినీగేయ రచయితగా శ్రీశ్రీ సృష్టించిన రికార్డలు ఇప్పటికి ఎవరూ బ్రద్దలు కొట్టలేదు. ‘కన్యాదానం’ సినిమా కోసం ఒక్కరోజులో 12 పాటలు రాసిచ్చారు శ్రీశ్రీ. అలాగే ఎఎన్నార్ నటించిన డాక్టర్ చక్రవర్తి కోసం శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై’ అనే మధుర గీతాన్ని ఇప్పటికి శ్రోతలు ఆరాధిస్తున్నారంటే ఆ పాటలో శ్రీశ్రీ పదాల అల్లిక గొప్పతనమే. ఇక సూపర్ స్టార్ కృష్ట నటించిన అల్లూరి సీతారామరాజులో ‘తెలుగువీర లేవరా’ అంటూ జాతిని ఉద్దేశించిన శ్రీశ్రీ రాసిన పాటని తెలుగు వారు మర్చిపోవటం సాధ్యమా.